Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

నాకేల కనకాభిషేకము?

ప్రతిదినము భక్తులు నాకు పూలమాలలు, బిల్వరామములు, తులసీమాలలు తెచ్చి సమర్పిస్తూ వుంటారు. ఇవి కాక పండ్లు, కొబ్బరికాయలు వేరే తెచ్చి ఇస్తుంటారు. తమకు తోచిన విధంగా ద్రవ్యరూపంగా భక్తిని వేరే చెల్లిస్తూ వుంటారు. విద్వాంసులు అభినందన పత్రికలు వ్రాసి చదువు తుంటారు. కవిత్వం తెలిసినవాళ్లు, తెలుగులో, గీర్వాణిలో- పద్యాలు, శ్లోకాలు వ్రాసినా ఎదుట పఠిస్తుంటారు. ఈ ప్రేమ కలాపమంతా నాకు కనకాభిషేకం లాగేవుంటుంది. ఇది చాలదని ప్రత్యామ్నాయంగా కాక ప్రత్యక్షంగానే కనకాభిషేకం చేస్తున్నారు.

ఇవన్నీ స్వీకరించడానికి నాకు గల అర్హత ఏమి? అని యోచిస్తే ఒకే ఒక కారణం కనపడుతూవుంది. శంకర భగవత్పాదులవారి దివ్యనామము ఏదో భాగ్యవశంగా నాకు లభించినదానివల్ల. ఆ పేరిట, ఆస్వామిని స్మరించి మీరందరూ ఈ మర్యాదలను నాకు చేస్తున్నట్లు వెల్లడి ఔతుంది.

ఇంత గౌరవమర్యాదలు మీవద్దనుండి స్వీకరిస్తున్న ఆచార్యపాదుల గుణగణము లేమి?

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్‌ |

నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్‌ |

శ్రుతులూ, స్మృతులూ, పురాణములూవారిలో వాసంచేసేవట! ప్రపంచంలోని సమస్త జీవరాసులూ, వారి కరుణాస్రవంతిలో మజ్జన మాడినవట! ఆ మహామహుని నామ మాత్రాన మీరు నాకు ఇంత ఘనంగా మర్యాదలు చేస్తున్నారు. ఈ గౌరవానికి పాత్రమగుటకు మే మెట్లా నడచుకోవాలో వారునుద్దేశించే వున్నారు. వారి ఆజ్ఞాపాలనం నేను అనుదినమూ చేయగలిగి నట్లైతే, అది దైనందిన కనకాభిషేకమే. వారి నామధారణాభాగ్యము ఎవరో కొందరికే లభించివున్నది. కాని ప్రతిఒక్కరూ ఏవిధంగా జీవితం గడప వలెనో వారు బోధించే వున్నారు. అనగా ఒక్క వ్యక్తికి కనకాభిషేకం చేయడానికి బదులు, మన మందరమూ వారి ఆజ్ఞాపాలన చేయగలిగినట్లైతే, వారి అనుగ్రహ మనే కనక ధారలో, ఆనందవరములో సంప్లావితులము కాగలము.

ధర్మార్థ కామమోక్షము లనేవి చతుర్విధ పురుషార్థములు. ఇపుడు మీరు చేస్తున్న కనకాభిషేకము కేవలము అర్థసంబంధమైనది. ఆచార్యులవారి ఆజ్ఞాపాలనం చేశామో- అర్థమొకటేకాదు, అన్నిటికంటే ముఖ్యమైన ధర్మధార, ప్రేమధార, మోక్షధారలో మునిగి మనం ఆనందించవచ్చును. మన అభిలాషలన్నీ ఫలవంతములు కాగలవు. అపుడు మన జీవితములు పురుషార్థ సమన్వితములుగా సుసంపన్నములుగా గడుపుకోవచ్చు.

భగవత్పాదులవారి ఆజ్ఞ ఏమి? ఈశ్వర ప్రణిధానమే అది. పరమాత్మను ఏ విధంగా పూజించాలి?

భగవంతుని ఆర్చామూర్తులకు గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యముల నేపంచోపచారపూజలుచేస్తుంటాము. వీనికి మరికొన్ని ఉపచారములు కలిపి షోడశోపచారములు చేస్తుంటాము. ఇవీ చాలవని రాజోచితంగా చేసే, అరువది నాలుగు ఉపచారములు, చతుషష్ట్యుపచారములు వేరే కల్పించి వున్నారు. ఇవి కాక భగవత్పాదులవారు వేరే పూజావిధిని ఏదైనా సూచించిరా?

''వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయ తాం, తేనేశస్య విధీయతా మపచితిః ''-

నాయనా! నీవులోకక్షేమముకోసం నీ ఆత్మ శ్రేయస్సు కోసం వేదములు విధించిన నిత్యకర్మలు చేస్తూ వచ్చినావంటే, అదే ఈశ్వరారాధన ఔతుంది. అని అన్నారు.

వారి ఆజ్ఞ పరిపాలించాలని మన కందరికీ ఆసక్తిఉన్నది. కాని దానికి కావలసిన శ్రద్ధ ఉన్నదా? ఆ శ్రద్ధకొఱకై మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆ శ్రద్ధ ఆచార్యపాదుల అనుగ్రహం వుంటే కానీ లభించదు. వారి పాదములను నమ్ముకోవడమే దానికి మార్గం. భక్తికి సులభమార్గము గురువును నమస్కరించి వారి పాదముల నాశ్రయించి వారి పాదసేవ చేయటమే. ''సద్విద్వాన్‌ ఉపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదు కేసేవ్యతాం'' ''సద్విద్వాంసులు, గురువులు - వారి పాదుకలను సమాశ్రయింపుము.''

మనం చేసే నమస్కారములన్నీ కట్టకడపట ఎవరికి పోయి చేరుతాయి? 'సర్వదేవనమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి' కేశవు డంటే పరమాత్మయే. నాబోటి సన్యాసులకు మీరందరూ నమస్కరిస్తారు. సర్వసంగపరిత్యాగం చేసిన సన్యాసులు, ఈ నమస్కారలన్నీ నాకే అని అనుకొంటే అధోగతే. '' ఈ నమస్కారాలు నావి కావు. ఇవన్నీ కేశవునివి''- అన్న భక్తిభావనతో సన్యాసి 'నారాయణ, నారాయణ' అని నారాయణ నామోచ్ఛారణ చేయాలి. నమస్కార పరంపరను నారాయణునికే అర్పించాలి.

ప్రపంచంలోని జీవితం ఒక యాత్రలాగా వున్నది. యాత్ర అంటే ఒక మార్గం వుండవలె. దానినే 'అధ్వా' అని అంటారు. అది ఎక్కడ అంత మౌతుందో అది 'పారం'. వేద మార్గంలో వెళ్ళేవారికి 'పార' మేది ! నారాయణమూర్తియే. నమస్కారాలు ఎవరికి అర్పించాలి? నారాయణునికే, ఆయన దివ్యపాదములకే. అట్లు భగవత్పాదములుగా వుండేవి ఏవి? మన ఆచార్యులు భగవత్పాదులే.

మీరు చేస్తున్న వివిధ సపర్యా క్రియలన్నీ నేను వారి పాదములకే సమర్పిస్తున్నాను. మీరు స్థూలంగా చేస్తుంటే, నేను సూక్ష్మంగా- మానసికంగా వారికి అంకితం చేస్తున్నాను. వారి నామధారణామాత్రమున మీరు నాకు చేస్తున్న ఉపచారములను, వారికి నేను అర్పించకపోతే కృతజ్ఞతాలోపం కదా! ఈ కనకాభిషేకం ఒక్క రోజుకు పరిమితంకాక, అనుదిన కనకాభిషేకంగా వర్థిల్లాలి. అది ఆచార్యపాదుల ఆజ్ఞాపాలనమే అన్న విషయం మనం విస్మరించరాదు.

వేద సహిత కర్మానుష్టానమే ఈశ్వరార్చన- అని ఆచార్యుల వారన్నారు. అయితే ఈశ్వరపూజయే మన అంతిమ లక్ష్యమా? కాదు. కర్మాచరణ చేత మనము సాధించే లక్ష్యము ఈశ్వరపూజ. ఈ పూజ మరొక లక్ష్యమునకు సాధనాంగముగా నున్నది. ఆ అంతిమ లక్ష్యమేమి? దానిని భగవత్పాదులవారు, సోపానపంచకములో కట్టకడపట పరబ్రహ్మత్మనా స్థీయతాం- అని వివరించారు.

కర్మలను చక్కగా ఆగరించు, కర్మఫలములపై కోరిక ఉంచుకోవద్దు. పాపములను పోగొట్టుకొని సత్సాంగత్యము అలవరచుకో- అంటూ క్రమక్రమంగా చెప్పుకొంటూపోతూ 'పరబ్రహ్మాత్మనా స్థీయతాం' అని తమ బోధను ముగించారు.

సమస్తోపాధిస్థితమై యున్నది పరబ్రహ్మమే. కాని మన మనస్సు ఏకంలో కాక ఆవేశంలో చిక్కుకొని తపిస్తున్నది. వివిధ రూపములలో కనబడేదంతా పరమేశ్వరుడే అన్న నిశ్చయాత్మకబుద్ధి మనకు కలిగినదంటే ఇది వేరు, నేను వేరు అన్న భేదభావము- సమసిపోయి, అంతా నేనే- అనేసర్వాత్మక బుద్ధి- అనుభవానికి వస్తుంది. అదే మోక్షం. ఆచార్యుల వారు పరబ్రహ్మాత్మనా స్థీయతాం- అంటూ చెప్పేది అదే.

ఈ అనుభవసిద్ధికే వారు ఈశ్వరారాధన చేయమన్నారు. దానివలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తైకాగ్రత ఏర్పడుతుంది. కర్మ, భక్తి రూపములైన పూజలు సోపాన పరంపరలై పరమోచ్చస్థితికి మనలను తీసుకొని వెళ్లుతవి. ఈ కారణం చేతనే ఆచార్యులు అనుగ్రహించిన ఐదుశ్లోకములను- 'సోపానపంచక' మని వ్యవహరిస్తున్నారు.

జీవబ్రహ్మ- అభేదము అనుభవములో అర్థమౌతుంది. జ్ఞానమార్గాన్ని స్థిరీకరించిన భగవత్పాదులవారు భక్తి మార్గాన్నీ కర్మాచరణనూ బోధించారు. దీనివలన మనస్సు పక్వమై ఏకాగ్ర మౌతుంది. పిదప మనస్సు ఇతర విషయములను వదలి పరమసత్యంలో మగ్నమౌతుంది. వారు సూచించినదీ ఇదే.

అనగా ఫలాభిసంధిలేని కర్మాచరణ తద్ద్వారా ఈశ్వర ప్రణిధానము, ఫలమును ఎదురు చూచినపుడు- అది లభిస్తే సంతోషం- లభించకపోతే దుఃఖం కలుగుతున్నది. మనిషికి శాంతి లేకుండా పోతుంది. ఫలంఏదైనాసరే- అది ఈశ్వరునిది. వానికే అర్పిస్తున్నాను- అన్న భావన ఉంటే శాంతి తానుగా ఏర్పడుతుంది.

కర్మలన్నీ చేసిన పిదప 'జనార్దనః ప్రీయతాం' అని అంటూ వుంటాం. ఈ కర్మనా ప్రీతికోసంకాదు- జనార్దనుని ప్రీతికోసం అని దీని భావం. అట్లాచేస్తే శాంతి లేకుంటే ఆశాంతియే. కర్మానుష్ఠానం జనార్దమని యందు ప్రీతి వుంటే కాని చేయలేము. ఆ ప్రీతి కలుగుటకు పంచోపశార, షోడశోపచార, చతుషష్ట్యుపచారములను విధించారు. దానికంటే శ్రేష్ఠమైనపూజ నిష్కామకర్మ- ఫలాభిసంధి లేక వేదచోదిత మైన కర్మానుష్ఠానమే. ఇవన్నీ కట్టకడపట 'పరబ్రహ్మాత్మనా స్థీయతాం' అన్న తుది మెట్టుకు తీసుకొని పోగలవు.

అందుచేత శాస్త్రవిహిత కర్మలను చేయుటకు వలసిన శ్రద్ధను మనకు అనుగ్రహించవలెనని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. ఆ శ్రద్ధ మనకు కలిగినదంటే- 'బ్రహ్మైవాహం' అన్న అనుభవం సిద్ధిస్తుంది. అట్టి బ్రాహ్మీస్థితియే కనకాభిషేకం. కనకాభిషేక మేమి? రత్నాభిషేకమే |

''నమః పార్వతీపతయే హర హర మహాదేవ!''


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page